యుటిలిటీలో తీవ్ర పోటీ: 7వేల కోట్లతో భారత్‌లోకి ‘గ్రేట్‌వాల్ మోటార్స్’?
ఎస్ యూవీ మోడల్ కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన చైనా కార్ల తయారీ సంస్థ గ్రేట్‍వాల్ మోటార్స్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. త్వరలో రూ.7000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికతో ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపేందుకు గ్రేట్ వాల్ మేనేజ్మెంట్ సిద్దమైంది. గుజరాత్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఈ సంస్థ ఆసక్తితో ఉండగా, మహారాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతోంది.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన అతిపెద్ద ఎస్‌యూవీ ఉత్పత్తి సంస్థ ‘గ్రేట్ వాల్ మోటార్స్’ భారత్‌లోకి నేరుగా ప్రవేశించేందుకు యోచిస్తున్నట్లు సమచారం. ఈ మేరకు భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
భారత ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో గ్రేట్‌వాల్ నిర్ణయం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘హవల్ మోటార్ ఇండియా’ పేరిట ఈ సంస్థ అక్టోబర్ నెలకు ముందే భారత్‌లో నమోదు చేసుకున్నది.
aslo read ప్రీమియం సెగ్మెంట్లో ‘ఐఫోన్’దే హవా!
ఇటీవల ఉద్దీపన చర్యల్లో భాగంగా కొత్త సంస్థలకు కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గించి 15శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబర్ నెలకు ముందే భారత్‌కు వచ్చినందున తాజా తగ్గింపు హవల్ మోటార్స్‌కు వర్తించదు. ఈ నేపథ్యంలో కొత్తగా సొంత పేరుతోనే వచ్చేందుకు గ్రేట్ వాల్ మోటార్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రేట్ వాల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో భారత్‌లో పెట్టుబడులపై చర్చించేందుకు ప్రధాని మోదీతో గ్రేట్ వాల్ సీఈవో వే జియాన్‌జున్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ భేటీ తరవాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
aslo read హువావే బంపర్ ఆఫర్ : ఉద్యోగులకు డబుల్ ధమాకా
దీన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లో స్థలం కోసం కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సంస్థని ఆహ్వానించేందుకు మహారాష్ట్ర ఆసక్తి చూపు తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోత్సహకాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైందని సమాచారం.
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు చైనా వెళ్లి కంపెనీని ఆహ్వానించినట్లు సమాచారం. అన్ని సవ్యంగా సాగితే 2021 నాటికి ఉత్పత్తి ప్రారంభించడానికి కంపెనీ యోచిస్తోందని తెలుస్తోంది. గ్రేట్ వాల్ భారత్‌కి రావడం వల్ల యుటిలిటీ వాహనాల విభాగంలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.