Asianet News TeluguAsianet News Telugu

మాంద్యం ఎఫెక్ట్.. 18 ఏళ్ల నాటికి వెహికల్ సేల్స్.. పరిశీలనలో జీఎస్టీ కోత?


ఆటోమొబైల్ విక్రయాల్లో మరో నెల ప్రతికూల వ్రుద్ధిరేటు నమోదైంది. 2001 తర్వాత అతి తక్కువ సేల్స్ రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ రంగాన్ని బయటపడవేసేందుకు జీఎస్టీని తగ్గించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది.

Centre looks to cut GST rates as car sales slump persists in August
Author
New Delhi, First Published Sep 2, 2019, 12:12 PM IST

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సేల్స్ క్లిష్ఠంగా ఉందని మరోసారి రుజువైంది. దీన్ని బట్టి ఆటోమొబైల్ రంగంలో ఆర్థిక మాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టులో చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి వాహన విక్రయాలు పడిపోవటమే ఇందుకు నిదర్శనం.

అయితే ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు దారుణ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో స్వల్పంగా పన్ను రేట్లు తగ్గించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 18 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకోవడమే దీనికి నిదర్శనం. గతేడాదితో పోలిస్తే డీలర్లకు గత నెలలో పంపిణీ చేసిన వాహనాల సంఖ్య 34 శాతానికి పడిపోయింది. 2001 తర్వాత డీలర్లకు వాహనాల పంపిణీ తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి. 

ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ సంగతి చెన్నైలో మీడియాతో మాట్లాడిన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ విధిస్తోంది కేంద్రం.

గతేడాది 2,59,925 వాహనాలను డీలర్లకు పంపిణీచేసిన ఆరు ఆగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు ఈ ఏడాది 1,71,193 వాహనాలకే పరిమితం అయ్యాయి. ఇది 34 శాతం తక్కువ. జూలై వాహనాల విక్రయాలు 31 శాతం తగ్గినందు వల్లే డీలర్లకు వాహనాల పంపిణీ సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. 

గత నెలలో దిగ్గజ కంపెనీలైన మారుతి సుజుకీ, హ్యుండాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, హోండా, టయోటా కిర్లోస్కర్‌ కంపెనీల వాహన విక్రయాలు ఏకంగా రెండంకెల స్థాయిల్లో పడిపోయాయి.

ఆగస్టు నెలలో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ విక్రయాలు 33 శాతం మేర క్షీణించాయు. ఇక టాటా మోటార్స్‌ విక్రయాలు 58 శాతం, హోండా కార్స్‌ ఇండియా సేల్స్ 51 శాతం, టయోటా కిర్లోస్కర్‌ విక్రయాలు 21 శాతం పతనం అయ్యాయు. 

దేశీయంగా అమ్మకాలు జరిగే ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతి సుజుకిది ఉంటుంది. కానీ గత నెలలో కార్ల విక్రయాలు ఏకంగా 32.7 శాతం పడిపోయి 1,06,413 యూనిట్లుగా నమోదైనట్లు మారుతి సుజుకీ తెలిపింది. దేశీయంగా విక్రయాలు 34.3 శాతం కుప్పకూలి 97,061 యూనిట్లుగా నమోదు అయ్యాయని పేర్కొంది. గతేడాది ఇదే కాలంలో మారుతి సుజుకీ విక్రయాలు 1,47,700 యూనిట్లుగా ఉన్నాయి. 

స్విఫ్ట్‌, సెలేరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ వంటి కంపాక్ట్ మోడల్ కార్ల విక్రయాలు 23.9 శాతం పడిపోయి 54,274 యూనిట్లుగా ఉన్నట్లు మారుతి సుజుకి తెలిపింది. గతేడాది ఆగస్టులో 35,895 చిన్న కార్లు విక్రయించిన మారుతి సుజుకి ఈ ఏడాది 10,123 కార్ల విక్రయానికే పరిమితమైంది. 

వినియోగ వాహనాల విభాగానికి చెందిన విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎర్టిగా మోడల్ కార్ల విక్రయాల్లో స్వల్పంగా 3.1 శాతం పురోగతి నమోదైంది. మారుతిసుజుకి ఎగుమతులు 16.58 శాతం క్షీణించాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు కూడా 48,324 యూనిట్ల నుంచి 36,085 యూనిట్లకు పడిపోయాయి. ప్యాసింజర్‌ వాహన విభాగంలో అమ్మకాలు 32 శాతం కుప్పకూలగా వాణిజ్య వాహన విక్రయాలు 28 శాతం పడిపోయినట్లు మహీంద్రా వెల్లడించింది. 


గత నెలలో హోండా కార్స్‌ విక్రయాలు 17,020 యూనిట్ల నుంచి 8,291 యూనిట్లకు పడిపోయాయి. వినియోగదారుల సెంటిమెంట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఆటోమొబైల్‌ రంగంలో ప్రతికూల వృద్ధి నమోదవుతోందని హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ అన్నారు. మరోవైపు హ్యుండాయ్‌ మోటార్‌ విక్రయాలు కూడా 16.58 శాతం పడిపోయాయు. 

టయోటా కిర్లోస్కర్‌లో 24 శాతం పడిపోయి 10,701 యూనిట్ల విక్రయాలు జరిగాయని సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా అన్నారు. గత నెలలో ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలతో రానున్న రోజుల్లో అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

మరోవైపు గతనెలలో ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ విక్రయాలు మాత్రం స్వల్పంగా 1.5 శాతం మేర పెరిగాయి. టాటా మోటార్స్ సేల్స్ 58 శాతం పడిపోయాయి. గతేడాది 17,351 కార్లు విక్రయించిన టాటా మోటార్స్.. ఈ ఏడాది 7,316 యూనిట్ల సేల్స్‌కు మాత్రమే పరిమితమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios