Top 5 Electric Cars: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ.. టాప్- 5 మోడల్స్ ఇవే..!
టాటా మోటార్స్ నుండి నెక్సాన్ EVకి ఉన్న డిమాండ్‌ను గమనిస్తే కంపెనీ భారతదేశంలో EV రేసులో ప్రవేశించడానికి ప్రణాళిక గట్టిగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. టాటా నెక్సాన్ EV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన EVగా ప్రసిద్ధి చెందింది.
దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు భారీగా రాయితీలు ప్రకటిస్తుంది. దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. అయినప్పటికీ మనదేశంలో EV పరిశ్రమ ఇంకా అభివృద్ది దశలోనే ఉంది. ఎలక్ట్రిక్ కార్ల (Electric cars) అమ్మకాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ గత ఫిబ్రవరిలో EV విభాగంలో 96.26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్- 5 ఎలక్ట్రిక్ కార్ల జాబితాను పరిశీలిద్దాం.
టాటా నెక్సాన్ EV, టాటా టిగోర్ EV
టాటా నెక్సాన్, టిగోర్ దేశంలో ఎలక్ట్రిక్ కార్ల (Electric cars) అమ్మకాల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ రెండు మోడల్స్ ఇటీవల అప్‌డేట్ అయ్యాయి. టాటా మోటార్స్ గత నెలలో 2,264 యూనిట్ల నెక్సాన్, టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. అయితే గతేడాది ఇదే నెలలో కేవలం 434 యూనిట్లు మాత్రమే అమ్మకాలు సాధించాయి. ప్రస్తుత అమ్మకాలు 421 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం.
టాటా టిగోర్ EV గతేడాది రూ. 11.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఎక్స్ షోరూమ్ ధర రూ.12.99 లక్షలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కార్లకు రేటింగ్స్ ఇచ్చే NCAP ద్వారా టాటా టిగోర్ EV ఫోర్ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత భద్రమైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డ్ సృష్టించింది. ఎలక్ట్రిక్ సెడాన్ ARAI- సర్టిఫైడ్ శ్రేణితో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ. ప్రయాణించవచ్చు.
Nexon EV
దేశంలో అత్యధికంగా అమ్మకాలు సాధించిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. రెండేళ్ల క్రితమే మార్కెట్లోకి విడుదలైన ఈ కారు ఇప్పటివరకు 13,500 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. ఈ మేరకు టాటా మోటర్స్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. నెక్సాన్ (Nexon) ఎలక్ట్రిక్ కార్లకు 30.2 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీంతో రీఛార్జ్ లేకుండానే 312 కిమీ రేంజ్‌ను అందిస్తుంది.
MG ZS EV
టాటా మోటార్స్‌కు ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ రంగంలో గట్టిపోటీనిస్తోంది MG మోటార్. భారతదేశంలో MG తరుపున ఏకైక ఎలక్ట్రిక్ కారు ZS EV మాత్రమే. దేశంలో అత్యధికంగా అమ్మకాలు సొంతం చేసుకున్న మూడో ఎలక్ట్రిక్ కార్ (Electric cars) గా MG ZS నిలిచింది. ఫిబ్రవరిలో ZS EV కేవలం38 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు MG వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరి అమ్మకాలతో పోల్చితే ఈసారి చాలా తక్కువ యూనిట్లు అమ్మకాలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 90 యూనిట్లకు పైగా అమ్మకాల వృద్ధి సాధించినట్లు MG పేర్కొంది.
ZS EV అనేక ఫీచర్లతో అప్‌డేట్ అయింది. ప్రధానంగా కారు ముందు భాగంలో కొత్త ఫ్రంట్ గ్రిల్ హైలైట్‌గా నిలిచింది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కొత్త ఫ్రంట్ గ్రిల్ ఏర్పాటు చేశారు. ఈ వారం ప్రారంభంలో ZS EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ₹21.99 లక్షల ప్రారంభ ధరతో MG మోటార్ విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే ఇది 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.
మహీంద్రా ఈవెరిటో
టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో (Top 5 Electric Cars) మహీంద్రా ఈవెరిటో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది చివర్లో ఈ మోడల్‌లో కనీసం మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధంగా ఉంది. గత నెలలో ఈవెరిటో 12 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.
బీవైడీ e6
టాప్ 5 EV (Top 5 Electric Cars)లో ఇది చివరి స్థానంలో కొనసాగుతుంది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో e6 ఎలక్ట్రిక్ MPవాహనాన్ని BYD ఇంకా అందుబాటులోకి రాలేదు. B2B విభాగంలో ప్రస్తుతం మూడు వరుసల ఎలక్ట్రిక్ వాహనాన్ని విక్రయిస్తుంది. దేశంలోని ఫ్లీట్ ఆపరేటర్‌లను టార్గెట్ గా పెట్టుకుంది. గత నెలలో e6 MPV10 యూనిట్లను విక్రయించినట్లు BYD వెల్లడించింది. 71.7 kwh బ్లేడ్ బ్యాటరీని BYDe6 కలిగి ఉంది. ఒకసారి రీచార్జ్ చేస్తే 500 కిమీల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదు. ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 1.5 గంటల్లోనే బ్యాటరీని పూల్ ఛార్జ్ అవుతుంది. అలాగే టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో Audi e-tron, Hyundai Kona, Jaguar I-Pace, Mercedes EQC, Porsche Taycan చోటు సంపాదించాయి.