గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విమానయాన సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎయిరిండియా, గో ఎయిర్ సంస్థలు ప్రయాణికులకు చౌకగా విమాన ప్రయాణం అందించనున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా నడిచే విమాన టికెట్లను తక్కువ ధరలకు విక్రయించనున్నామని ఎయిరిండియా విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

28 వరకు ఎయిర్ ఇండియా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు

అతి తక్కువ రేట్లకు లభించనున్న ఈ టికెట్లను జనవరి 26 నుంచి 28వ తేదీ వరకూ కొనుగోలు చేయవచ్చని, ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీలోగా ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఇందుకోసం ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌, ఎయిర్‌లైన్‌, సిటీ బుకింగ్ ఆఫీస్‌లు, కాల్‌ సెంటర్‌లు, ట్రావెల్‌ ఏజెన్సీలను సంప్రదించవచ్చని చెప్పారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు.

ఎయిరిండియా ఆఫర్లు రూ.979 నుంచి రూ.6965 వరకు..

దేశీయంగా నడిచే విమానంలో ఒకవైపు ప్రయాణానికి కనిష్ఠంగా అన్ని ఛార్జీలు కలిసి ఎకనామిక్‌ క్లాస్‌లో రూ.979 నుంచి బిజినెస్‌ క్లాస్‌ టికెట్ల ధర రూ.6,965 వరకూ ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. అంతర్జాతీయంగా నడిచే విమానాల్లో ప్రయాణానికి కూడా అతి తక్కువలో టికెట్‌ ధరలు ఉన్నాయని, ఎకానమీ క్లాస్‌లో రూ.55వేలకే అమెరికా ప్రయాణం చేసే వీలుందన్నారు. 

విదేశాలకు రూ.32 వేల నుంచి రూ.50 వేల వరకు టిక్కెట్లుయూకే, యూరప్‌ సెక్టార్లకు రూ.32వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్‌లో రూ.50వేలకే టికెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11వేలకు టికెట్లు ధరలున్నాయని, అలాగే సార్క్‌, గల్ఫ్‌ దేశాలకు అతి తక్కువ ధరలోనే టికెట్లు లభిస్తాయని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

26 ప్రముఖ ప్రాంతాలకు గో ఎయిర్ ఇలా ఆఫర్

బడ్జెట్‌ విమానయాన సంస‍్థ గోఎయిర్‌ కూడా తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. దేశంలోని 26 ప్రముఖ ప్రాంతాలకు  రూ.999లకే టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది.  నేటితో ఈ ఆఫర్‌ముగియనుంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 9 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.

గో ఎయిర్ టిక్కెట్ ధర రూ.999 టు రూ.4,599

హైదరాబాద్, కోల్‌కతా, గోవా, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, గోవా, బాగ్దోగ్రా, ఛండీగఢ్, రాంచీ, జైపూర్, లక్నో, చెన్నై, నాగపూర్, పుణె, పాట్నా, శ్రీనగర్ రూట్లలో గో ఎయిర్ టికెట్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ సంస్థ ప్రకటించిన ఆఫర్లలో కనిష్టంగా రూ.999కే విమాన ప్రయాణం చేయవచ్చు. బాగ్దోగ్రా-గౌహతి మధ్య కేవలం రూ.999 కే ప్రయాణించవచ్చు. ఇక ముంబై-లేహ్ రూట్లో ప్రయాణించాలంటే రూ.4,599 చెల్లించాల్సి ఉంటుంది. 

సగం ధరకే జెట్ ఎయిర్వేస్ టిక్కెట్లు

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లను సగం ధరకే విక్రయించనున్నట్టు  ప్రకటించింది. ఈ  ఏడు రోజుల సేల్‌లో పరిమిత కాలం ఆఫర్‌గా అందిస్తున్న 50 శాతం వరకూ డిస్కౌంట్‌ ఇరువైపుల ప్రయాణానికి వర్తిస్తుందని తెలిపింది. ప్రీమియం, ఎకానమీ క్లాసుల్లో కూడా ఈ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.  

30 వరకు అందుబాటులో జెట్ ఎయిర్వేస్ ఆఫర్లు

జనవరి 30వరకూ జెట్ ఎయిర్వేస్ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. మస్కట్‌, షార్జా తప్ప గల్ఫ్‌లోని అన్ని దేశాలతోపాటు బ్యాంకాక్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, ఖాట్మాండు, కొలంబో, ఢాకా వెళ్లే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపదికన ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.