న్యూఢిల్లీ‌: ఇండియా కవాసాకీ మోటార్స్‌ భారత్‌లో ‘ది 2020 నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌’ను విడుదల చేసింది. దీనికి సరికొత్త రంగులను కూడా జత కలిపింది. సాధారణంగా నింజా స్పోర్ట్స్‌ బైక్‌లు ఆకుపచ్చ నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ, ఈసారి బైక్‌ హైలైట్స్‌ను బంగారు వన్నెలో తీర్చిదిద్దారు. 

దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.13.99లక్షలుగా నిర్ణయించారు. కేవలం రంగుల్లో మాత్రమే నింజాలో మార్పులు చోటు చేసుకున్నాయి. బైక్ సామర్థ్యం పరంగా ఏ మార్పులు చేయలేదు.

ఈ బైక్‌లోనే జెడ్‌ ఎక్స్‌ -10ఆర్‌లో కేఆర్‌టీ ఎడిషన్‌ను మాత్రం వచ్చే అక్టోబర్‌ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ఈ బైకులో 4- సిలిండర్లతో కూడిన 998సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 13,500 ఆర్‌పీఎం వద్ద 200.2 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి క్విక్‌ షిప్టర్‌తో 6స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. 

జడ్ఎక్స్ 10ఆర్‌లో ఓహ్లిన్స్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డంపర్‌తోపాటు పూర్తిగా అడ్జస్టబుల్ షోవా, డ్యుయల్ బ్రెంబో ఎం 50 మొనొ బ్లాక్ కాలిపర్స్ ఉంటాయి. స్పోర్ట్స్ కవాసాకీ ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, త్రీ రైడింగ్ మోడల్స్, సిక్స్ ఆక్సిస్ ఐఎంయూ, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ఏబీఎస్ తదితర ఫీచర్లు జత కలిశాయి. 

సింగిల్ సీటర్ వర్షన్ మాత్రమే జడ్ఎక్స్ -10ఆర్ లో అందుబాటులోకి రానున్నది. ఈ బైక్ డుకాటీ పానిగేట్ వీ4, సుజుకి జిఎస్ఎక్స్-ఆర్ 1000, హోండా సీబీఆర్-1000ఆర్, యమహా వైజడ్ఎఫ్-ఆర్1, బీఎండబ్ల్యూ ఎస్ 10000ఆర్, ఆర్పిల్లా ఆర్ఎస్ వీ4 ఆర్ఆర్ బైక్‌లతో గట్టిగా పోటీ పడనున్నది.