ఇది సంవత్సరంలో ఎనిమిదవ మాసం. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమినాడు చంద్రుడు ఉండే మాసం కార్తీక మాసం.

భాద్రపదమాసంలో గణపతిపూజ, తరువాత పితరుల ఆరాధన, ఆశ్వయుజమాసంలో అమ్మవారి పూజలు అనంతరం వచ్చేమాసం అయ్యవారి పూజతో కార్తీకంలో సమాప్తమౌతుంది. అంటే చాతుర్మాస్య దీక్ష చేసేవారి దీక్ష కూడా ముగుస్తుంది. కార్తీక అమావాస్యకి, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. ఈ మాసంలో ఆకాశదీపం విశేష ఫలితాలనిస్తుంది.

ఈ మాసాలలో ప్రతి ఒక్కరికి రుచులు కావాలని అనిపిస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన రోగాలు వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక భారతీయ సంప్రదాయంలో ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు ఏవో వ్రతాలు, దీక్షలు, నోముల పేరిట ఆహారానికి బంధనం విధిస్తారు. ఆ రకంగానైనా కట్టుబాట్లతో ఉంటారని, వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుటాంరని నియమ నిష్టలు ఎక్కువగా పెట్టారు.

ఈ మాసంలో సోమవారాలు, సూర్యోదయాత్పూరం స్నానాలు చేయడం, ఉసిరిచెట్టు కింద వనభోజనాలు చాలా విశేషమైనవి. ఈ మాసం ఒక్క మాసంలోనే శివుడికి, కేశవుడికి ఇద్దరికీ ప్రాధాన్యత ఇస్తారు. సోమవారాలు శివునికి ప్రీతి కరమైనవైతే ఏకాదశి విష్ణువుకు ప్రత్యేకమైనది. ఈ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనినే శయనైక ఏకాదశి అంటారు. విష్ణువు ఆషాఢమాసంలో నిద్రకు ఉపక్రమించి, ఈ ఏకాదశినాడు నిద్రనుండి లేస్తాడు అంటారు.

కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి. ఈ రోజున తులసి వివాహం చేస్తారు. తులసి చెట్టుకు, ఉసిరిచెట్టుకు వివాహం చేసి చాలా వైభవంగా పూజ చేస్తారు. ఈ రోజు వీలుకానివారు కార్తీక పౌర్ణమిరోజున తులసి వివాహం చేస్తారు. తులసి లక్ష్మీదేవి అవతారం అని, శ్రీకృష్ణవిగ్రహం పెట్టి వరునిగా భావించి ఈ కళ్యాణం జరిపిస్తారు.ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం తులసిపట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి అనుకోవాలి.

కార్తీక శుద్ద చవితి నాగుల చవితి. ఈ రోజున నడుం తొక్కితే నావాళ్ళనుకుని, తోక తొక్కితే తొలగిపోయి, కాచి రక్షించు తండ్రీ, నాగేంద్రుడా, ఫణీంద్రుడా అని పుట్టలో పాలు పోస్తారు. చెవి బాధలు, కింబాధలు ఉన్నవాళ్ళకు ఈ చవితి ఉపవాసం మంచిది. పుట్టలో పాలు పోసి ఆ మట్టి ని కొంచెం తీసుకొని చెవులకు, కళ్ళకు పెట్టుకుటాంరు. వస్త్రాలు పుట్టపై పెట్టి తిరిగి వాటిని ధరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని కొన్ని ప్రాంతాలలో ప్రతీతి.

సంతాన దోషాలు ఉన్నవారు ఈ పుట్ట చవితిరోజు పూజ చేయడం మంచిది. ఆ రోజు ఉపవాసాలు ఉండాలి. సంతాన దోషాలు, సర్పదోషాలు ఉంటాయని చెపుతారు. తాము గతంలో ఏదో ఒక శక్తిని నిర్వీర్యం చేసి ఉంటారనే భావనతో ఈ జన్మలో ఆ దోషాలను నివారించుకోవడానికి గాను నాగ ప్రతిష్టను కూడా చేయించడం మంచిది. ఒక ప్రకృతి శక్తిని కాపాడితే తమలో శక్తి పెరిగి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం అనుకూలంగా లేకపోయినా, మాట వినకపోయినా, ఈ కార్తీక మాసంలో వచ్చే చవితికి పూజ చేయడం వలన ఆ దోషాలను నివారించుకునే అవకాశం ఉంటుంది.

ఈ కార్తీక మాసంలో ప్రతీరోజు ఏదో ఒక పూజ చేసుకొని, ఆ మూలకంగానైనా కొంతమందికి తమకు తోచినవి దానం చేస్తూ గతంలో తాము చేసిన పాపాలు పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు.

డా.ఎస్.ప్రతిభ