మనసు అంతగా ఉత్సాహంగా పనిచేయదు. సృజనాత్మకత తక్కువగా ఉంటుంది. శరీరం మందంగా ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా పనులు పూర్తి చేయలేరు. పట్టుదల తక్కువగా ఉంటుంది. శరీర శ్రమ అధికంగా ఉంటుంది.  గుర్తింపుకోసం ఆరాట పడతారు.

మానసిక అలజడి ఎక్కువగా ఉంటుంది. చిత్త చాంచల్యంతో పనులు చేస్తారు. ఒక పనిని చేయాలంటే వందరకాల ఆలోచనలు వస్తాయి. ఏ పని పూర్తి చేయాలో తెలియదు. సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి. సంతానం మాట వినకుండా ఉంటుంది. సృజనాత్మకత తక్కువగా ఉంటుంది. ఒకరితో పనిచేయించుకోవడం తెలియదు. అంటే ఎదుటివారి మనసు నొప్పించకుండగా తమకు కావలసిన పనులు చేయించుకోలేరు. అజమాయిషి పనికిరాదు. ఎప్పుడూ మత్తుగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు.

ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం. మోకాళ్ళ నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని సంపాదన రావాలనే ఆలోచనలు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు ఉంటాయి.

పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. లాభాలపై దృష్టి ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండాలి.  శ్రమలేని ఆదాయం కావాలని కోరుకుటాంరు. కళాకారులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు.

శరీరాన్ని కష్టపెట్టలేరని తెలుసుకున్నప్పుడు ఆ పని చేయడానికి కొంత కష్టపడవలసి ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. నిరంతరం వ్యాయామాలు చేస్తూ ఉంటే ఎక్కువ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మనసుకు తెలియకుండా పనులు సులువుగా అయిపోతూ ఉంటాయి.

సంతానం మాట వినకపోవడం అంటే తమకు పుణ్యబలం తగ్గిందని అర్థం చేసుకోవాలి. తమ పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి కాని పిల్లలు అల్లరి చేస్తున్నారు మాట వినడం లేదని అనుకోకూడదు. అల్లరి పిల్లలు చేయకపోతే పెద్దవారు చేస్తారా? ఆలోచనల వల్ల చికాకు ఉంటుందని తెలుసుకున్నప్పుడు ఆలోచన చేయడం మానివేయాలి. ఇది అంత సులువైన పనేమీ కాదు. ఆలోచనలు లేకుండా ఎలా ఉంటారు. ఏ పని జరుగుతుంది అనుకుటాంరు. కాని తాము ఆలోచించడం వల్ల ఒక పని జరగడం, తాము ఆలోచించకపోతే ఆ పని ఆగిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. జరిగే విషయం తాము ఆలోచించినా, ఆలోచించకపోయినా అవి జరుగుతూ ఉంటాయి. తాము చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మసలుకోవడం మంచిది.

ఊహించని ఇబ్బందులు, అనవసర ఖర్చులు ప్రమాదాలు ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు అన్ని పనులు తానే చేస్తానని ముందుకు వెళ్ళకూడదు. ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ పెట్టే ఖర్చు ప్రయోజనకారియై ఉండేట్లుగా పెడితే బావుంటుంది. ఖర్చు పెట్టిన దానికి పుణ్యబలం పెరగాలి. అందుకు వీరు దానం చేయాలి. దానం అవసరార్థికి అవసరమైన వస్తువలు ఇస్తూ ఉండాలి. ఇచ్చినందుకు అహంకారం పెరుగకూడదు. తానే ఇస్తున్నానే ఆలోచన ఉండకూడదు.

వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. పదిమందికి మేలు కలిగించే పనులు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రకృతిని పశుపక్షాదులను కాపాడే పనులు చేయాలి. సేవ చేయడానికి ఎక్కువగా ఇష్టపడాలి. ఆశింపు అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఆశింపు ఉంటే అది సేవ కాదు. ఈ విషయం గుర్తుంచుకొని మసలుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ