Asianet News TeluguAsianet News Telugu

గ్రహ 'శని' దోషాలు పరిహారం

సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. 

Compensation for planetary 'Saturn' bugs
Author
Hyderabad, First Published Aug 28, 2021, 12:41 PM IST

 

                "నీలాంజన సమాభాసం 
                 రవిపుత్రం యమాగ్రజం
                 ఛాయా మార్తాండ సంభూతం 
                 తం నమామి శనైశ్చరం" 

భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని ఒక గ్రహం. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.

శని ప్రభావం:- సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఏలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశ కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి, మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. 

కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు. ఇతి భాదలు తొలగాలి అంటే ఏం చేయాలో చూద్దాం.

ప్రతి రోజు దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి. నల్ల చీమలకు చక్కర వేయాలి. శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి. అలాగే పేదలకు తమకు చేతనైన సాయం చేయాలి. శనివారం నువ్వుల నూనెను తలకు, శరీరం మొత్తం పట్టించి తలంటుస్నానం చేయాలి. శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి, విష్ణు సహస్ర నామాలు చదువుకోవాలి. బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాళ్ళను బాగా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. శనివారాల్లో కోతులకు అరటిపండును ఇవ్వడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయి.

అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాలమందు శనిగ్రహదోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రభావాలుంటే తప్పకుండా శనివారం పూట శనీశ్వరునికి అర్చన చేయించాలి. శని శాంతి పూజ చేయించు కోవాలి. అలాగే శనీశ్వర ప్రభావంతో ఏర్పడే ఈతిబాధలు తొలగిపోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుని, అయ్యప్ప ఆరాధన చేస్తే శనిగ్రహ దోషాలు తగ్గుతాయి. 

శనివారం నాడు శని మంత్రాలను జపించుట, రావిచెట్టునకు రోజు11 ప్రదక్షిణాలు " ఓం నమో భగవతే వాసుదేవాయ" అని స్మరిస్తూ చేస్తే శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. నల్లని వస్త్రాలు, ఇనుము, తోలు, పత్తితో తయారైన వస్తువులు దానం చేయటం మంచిది. తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు. అలాగే నిద్రలేమి, మత్తు పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం ఇలా ఒకటేమిటి అన్నివ్యాధులకు, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది. 
 
భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల  ద్వారా స్వామి వారిని శాంతింపజేస్తే ఈతిబాధలుండవు. కాలపురుషుని జీవనాధిపతి అయిన శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలవాడు. అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగవు.

ముఖ్యంగా శనిగ్రహా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు తల్లి దండ్రులను పూజించాలి, వారిని గౌరవించాలి, కుటుంబ భాధ్యతలను విస్మరించ వద్దు, జూదం, మద్యం జోలిగి పోవద్దు, శనివారం మాంసాహారం తినవద్దు. ప్రతి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర నుండి లేచి సమయాన్ని వృధా చేయకుండా కార్యోన్ముకులు అవ్వాలి. కుటుంబ సభ్యులకు పనులలో సహాయపడాలి. పేదవారికి, అవిటి వారికి, వృద్ధులకు, పశు పక్ష్యాదులకు చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయి.     

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios