ఒంగోలు: ఎన్నికలు సమీపిస్తున్నా అసంతృప్తినేతల అలకలు మాత్రం పార్టీలను వీడటం లేదు. టికెట్ రాలేదని అలకవహించిన నేతలు ఇంకా అలకవీడటం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇంకా అలకపాన్పు వీడలేదని తెలుస్తోంది. 

ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన గత కొద్దిరోజులుగా జగన్ కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన డుమ్మా కొట్టారు. 

కొండెపి నియోజకవర్గంలో వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభకు వైవీ సుబ్బారెడ్డి రాకపోవడంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైవీకి జగన్ టికెట్ ఇవ్వరని తెలిసినప్పటి నుంచి ఆయన అలకబూనారు.  పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ జగన్ తో నేరుగా కలిసే ప్రయత్నం చెయ్యడం లేదు. 

2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన ఆయనకు జగన్ టికెట్ నిరాకరించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఒంగోలు టికెట్ కేటాయించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడాన్ని ఆయన మెుదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 

తన చేతిలో ఓడిపోయిన అభ్యర్థిని ఎందుకు తీసుకువస్తున్నారంటూ ప్రశ్నించారు. అయినప్పటికీ వైఎస్ జగన్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇచ్చి బాబాయ్ కు హ్యాండ్ ఇచ్చారు. అప్పటి నుంచి అలకబూనారు వైవీ సుబ్బారెడ్డి. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలకవీడుతారని అంతా ఊహించినప్పటికీ ఆయన అలకవీడలేదు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభకు గైర్హాజరవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.