అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టడం ఇది ఒక నూతన అధ్యయనం అని కొనియాడారు వైసీపీ అధినేత వైయస్ జగన్. ఏపీ చరిత్రలో ఇదొక సంచలనం అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో ఈ విజయం సాధించడం జరిగిందని జగన్ తెలిపారు. మీ అందరి ఎదురుగా వచ్చి మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అలాగే చాలా గర్వంగా ఉందన్నారు. ఈ విజయం తనపై మరింత బాధ్యత పెంచుతుందని అలాగే తన ఆత్మ విశ్వాసానికి నిదర్శనమన్నారు. 

తాను విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తానని ప్రజలకు మంచి సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని ఆ అవకాశం తనకు ఇచ్చారని తెలిపారు. 

గవర్నెన్స్ అంటే ఏమిటి, గొప్ప గర్నెన్స్ అంటే ఏమిటో అనేది ఆరు నెలల లోపే నిరూపిస్తానని తెలిపారు. ప్రజలందరి చేత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల లోపు జగన్ మంచి సీఎం అనిపించుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. తనపై ఇంతటి నమ్మకాన్ని ఉంచి బాధ్యత కట్టబెట్టిన ప్రతీ ఒక్కరికి వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.