అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మే 23 సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన ప్రజలు కోరుకున్న నాయకుడిని ఎన్నుకున్నారని స్పష్టం చేశారు. 

వద్దు అనుకున్న నాయకుడ్ని దూరంగా పెట్టారని అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంతో శ్రమ పడ్డారని ఆశ్రమకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. ప్రజాతీర్పు చారిత్రాత్మకమని కొనియాడారు. 

ప్రజానాడి పసిగట్టి జాతీయ మీడియా సంస్థలిచ్చిన సర్వేలను చంద్రబాబు అపహాస్యం చేశారని విమర్శించారు. వైసీపీ 130కి పైగా సీట్లను గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పాయని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం మేరకే నాయకులు పథకాలు రూపొందించాలని చెప్పుకొచ్చారు. 

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2014లో ఓటమిని జగన్ హుందాగా తీసుకున్నారని కానీ చంద్రబాబు మాత్రం అధికారం లేకపోతే బ్రతకలేమన్న రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని చంద్రబాబు భ్రష్టుపట్టించారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను కలుషితం చేశారని తెలిపారు. వైసీపీ 175స్థానాలకు గాను వైసీపీ 150స్థానాల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. బై బై బాబూ అన్న స్లోగన్ ఢిల్లీ వరకు పాకిందని ఈ నేపథ్యంలో ఓడిపోయిన చంద్రబాబును ఢిల్లీలో ఒక్కరైనా కలుస్తారా అంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు.