అమరావతి: తనను ఐరన్ లెగ్ అన్న వారిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా తాను ఐరన్ లెగ్ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వెధవలు అసెంబ్లీలోనూ బయట కూసిన కూతలకు ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. 

తాను గెలిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు అన్న టీడీపీ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తనది ఐరన్ లెగ్ కాదని గోల్డెన్ లెగ్ అంటూ చెప్పుకొచ్చారు. తన ఉసురు చంద్రబాబు నాయుడుకు తగిలిందని ఆమె చెప్పుకొచ్చారు. 

తనను ఓడించాలని ఎన్నో కుట్రలు చేశారని కానీ నగరి ప్రజలు మాత్రం తనను గెలిపించారన్నారు. తాను నిత్యం ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిననని స్పష్టం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కోసం అసెంబ్లీలో పోరాడితే అకారణంగా తనను సంవత్సరం పాటు సస్పెండ్ కు గురి చేశారని అందువల్లే చంద్రబాబు ఆయన పార్టీ భూస్థాపితం కాబోతుందన్నారు. 

మహిళాసాధికారికత సమావేశానికి ఆహ్వానించి తనను 24 గంటలపాటు ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో ప్రజలకు తెలుసునన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు నిధులు ఇవ్వకుండా తనను ఓడించాలని ప్రయత్నించారంటూ ఆమె ధ్వజమెత్తారు. 

తాను ఎన్నికల ప్రచారంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని చెప్పానని అలాగే జరిగిందన్నారు. వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఎంతలా ప్రజలు సంతోషంగా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ప్రజలు సంతోషంగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని రోజా హామీ ఇచ్చారు.