న్యూఢిల్లీ: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను  తొలగించాలని కోరుతూ సీఈసీకి వైసీపీ నేతలు గురువారం నాడు ఫిర్యాదు చేశారు.

ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు గురువారం నాడు సీఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. సీఈసీని కలిసిన తర్వాత వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. సీఈసీ ఆదేశాలు జారీ చేసినా కూడ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీని నిలుపుదల చేస్తూ జారీ చేసిన జీవోను వైసీపీ నేతలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నెల 24వ తేదీన డీజీపీ ఆర్పీ ఠాకూర్ తన కారులోనే  అమరావతి నుండి  రూ. 35 కోట్లను ప్రకాశం జిల్లాకు తరలించారని ఆయన  ఆరోపించారు. ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవన్నారు.

అంతేకాకుండా ఏపీ రాష్ట్రంలోని పలు హోదాల్లో ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయాలని తాము గతంలోనే సీఈసీకి ఫిర్యాదు చేసినా కూడ ఎన్నికల సంఘం పట్టించుకోలేదన్నారు.

పోలీసు ఉన్నతాధికారులు దామోదర్‌నాయుడు, ఘట్టమనేని శ్రీనివాస్, యోగానంద్, ప్రవీణ్‌, చిత్తూరు జిల్లా ఎస్పీ, గుంటూరు రూరల్ ఎస్పీని బదిలీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. తాము గతంలో చేసిన ఫిర్యాదులను సీఈసీ పట్టించుకోని విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేశారు.

ప్రజా శాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తును పోలి ఉందన్నారు.  35 అసెంబ్లీ , 4 ఎంపీ స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ  చీఫ్ కేఏ పాల్ చంద్రబాబునాయుడుతో కుమ్మకై తమ పార్టీకి చెందిన అభ్యర్ధుల పేర్లను పోలిన వారిని బరిలోకి దింపినట్టుగా ఆయన చెప్పారు.ఈసీ ఆదేశాలను చంద్రబాబునాయుడు ఖాతరు చేయడం లేదని వైసీపీ  నేతలు ఆరోపించారు.

ఆర్పీ ఠాకూర్ వాహానాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. తాము డీజీపీపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.  తాము చేసిన ఆరోపణలు తప్పైతే కేసు పెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.