ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రధాన పార్టీలన్ని మరింత జోరు పెంచాయి. అభ్యర్థుల తుది ఎంపిక, అసమ్మతుల  బుజ్జగింపులు,  ప్రచార వ్యూహాలు ఇలా ఎన్నికల పనుల్లోనే తలమునకలైపోవడమే కాదు ప్రత్యర్థి పార్టీలను మాటలతో  ఇరుకునపెడుతూ, తీవ్ర విమర్శలతో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అధికార టిడిపి పార్టీని  మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై తీవ్ర విమర్శలు చేస్తూ విజయసాయి రెడ్డి ఓటర్లను వైఎస్సార్‌సిని వైపు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇలా అధికార టిడిపి పార్టీపై విమర్శలకోసం విజయసాయి రెడ్డి సోషల్ మీడియాను ప్రధాన వేదికగా మార్చుకున్నారు. మరీ ముఖ్యంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అలా తాజాగా మరోసారి వారిపై ద్వజమెత్తుతూ విజయరెడ్డి కొన్ని ట్వీట్లు చేశారు.

''చంద్రబాబు దేవుళ్లను నమ్మడు. వాళ్లను సృష్టించింది తనే అని భ్రమపడతాడు. పొద్దున్నే తన ఫోటోనే ఎదురుగా పెట్టుకుని ప్రార్థిస్తాడట. ప్రజలకు నిన్నటి విషయాలేవి గుర్తు రాకుండా చేయమని వేడుకుంటాడట. మోదీ సంకలో ఉన్నప్పటి  విషయం, దొంగ హామీలను ఎవరూ ప్రస్తావించరాదని తనకు తానే మొక్కుకుంటాడట.'' అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు విసిరారు.
  
మరో ట్వీట్ లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకేరోజు వుండటంపై చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో విజయసాయి రెడ్డి బయటపెట్టారు.  ''తనను ఇబ్బంది పెట్టేందుకే ఎన్నికలను మొదటి ఫేజ్ లో పెట్టారని చంద్రబాబు కళ్లనీళ్లు కారుస్తున్నాడు. అసలు బాధ తెలంగాణా,ఏపీల్లో ఒకేరోజు పోలింగు జరగడం పైన. వేర్వేరుగా జరిగితే 2014లో లాగా అక్కడి నుంచి పదిలక్షల మందిని రప్పించి గెలవొచ్చన్నది ప్లాన్. స్కీమ్ లు, ఎత్తులు ఇక పనిచేయవు బాబూ'' అంటూ ట్వీట్ చేశారు. 

ఇక మరోసారి చంద్రబాబు తనయుడు లోకేశ్ మంగళగిరి నుండి పోటీ చేయడంపై విజయసాయి రెడ్డి స్పందించారు. '' పప్పు కోసం మంగళగిరిని ఎప్పుడో డిసైడ్ చేశాడు తుప్పు. ఎక్కడి నుంచైనా గెలుస్తాడనే బిల్డప్ ఇచ్చేందుకు కుల మీడియా ద్వారా ఇంకో నాలుగు పేర్లు చెప్పించాడు. మంత్రిగా పది మార్కులు రాని పప్పుకు మంగళగిరి ప్రజలు జీవితాంతం గుర్తుండేలా వాతలు పెట్టి, పచ్చబొట్లు పొడిచి వదులుతారు.'' అని అన్నారు.