ఆంధ్ర ప్రదేశ్‌లో సార్వత్రికి ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో వున్నా అధికార బలంతో తెలుగు దేశం పార్టీ ఉళ్లంఘనలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్‌సిపి నాయకులు ఆరోపిస్తున్నారు. టిడిపి పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు జిల్లాలో కోడ్ ను ఉళ్లంఘిస్తూ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తుండగా వైఎస్సార్‌సిపి నాయకులు అడ్డుకోగా...తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా పంపిణీ కోసం సైకిళ్లను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు.

నెల్లూరు జిల్లాలోని మూలాపేట పాఠశాలకు సైకిళ్లను తరలిస్తున్న వాహనాన్ని వైఎస్సార్‌సిపి స్థానిక కార్పోరేటర్ వేలూరి  మహేష్, నాయకులు చంద్ర, నాగారాజు, జనార్ధన్ రెడ్డి లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ...తెలుగు దేశం పార్టీ మరోసారి అధికారాన్ని చేపట్టాలనే కాంక్షతోనే ఇలా అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో వుండగా ఇలా పార్టీ గుర్తులు, నాయకుల పేర్లతో కూడిన స్టిక్కర్లతో సైకిళ్లను పంపిణీ చేయడానికి టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలా తరలిస్తున్న ఓ  వాహనాన్ని అడ్డుకున్నట్లు మహేష్ తెలిపారు. 

కేవలం నెల్లూరులోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అన్ని పాఠశాలల్లో సైకిళ్ల పంపిణీపి నిలిపివేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

వీడియో

"