మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై మంత్రి నారాలోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా మరణంతో తాము బాధలో ఉంటే.. చంద్రబాబు వెటకారపు నవ్వులతో మాట్లాడారని ఆయన మండిపడ్డారు.

ముఖ్యమంత్రిది నీచ మనస్తత్వమని, మానవత్వం ఉన్న మనుషులెవరు ఇలా ప్రవర్తించరని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హంతకులను పట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో జగన్‌ను ఇరికించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఎలాగైనా లాభం పొందాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, వివేకా హత్య కేసులో ప్రభుత్వ ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. జగన్ ఎప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని..కార్యకర్తలను సంయమనం పాటించాలని కోరారని గుర్తు చేశారు.

చేసిన అభివృద్దిని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పుకోలేకపోతున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఏం చేశారని ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీస్తున్నారని.. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీకొట్టారని పార్థసారథి ఆరోపించారు.

బాబు చేసిన భూకబ్జాలు రాష్ట్ర చరిత్రలో లేవని ఎద్దేవా చేశారు.  వైసీపీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు తమపై బురద జల్లుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి నారా లోకేశ్ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అక్కడ మాట్లాడుతూ.. ‘‘ పాపం వివేకానందరెడ్డి చనిపోయారు.. ఆ విషయం తెలిసి పరవశించాం అంటూ తడబడ్డారు. దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.