హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. పవన్ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. 

రాజకీయ లబ్ధికోసమే పవన్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పవన్‌ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. 

పవన్‌ కళ్యాణ్‌లా ఊసరవెల్లిలా తాము మారలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ సోదరుడు నాగబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఓటు టీఆర్‌ఎస్‌కు వేశానని స్వయంగా చెప్పారని గుర్తుకు తెచ్చుకోవాలంటూ చెప్పుకొచ్చారు. 

ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు టీఆర్‌ఎస్‌ గెలవాలని కోరుకున్నారంటూ ప్రశ్నించారు. ఏపీలో వైసీపీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్ల అవుతుందని మామీద విమర్శలకు దిగడం సరికాదన్నారు. 

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న బొత్స సీఎం చంద్రబాబు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు హత్యరాజకీయాల్లో ఆరితేరారని, సొంత మామనే వెన్నుపోటు పొడిచారంటూ ధ్వజమెత్తారు. 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి పదిరోజులు కావస్తున్నా నిందితులను కనిపెట్టకపోవటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. పవన్‌ ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాన్ని కాదని, అధికారపార్టీనని చెప్పారు. 

ఐదేళ్లలో చం‍ద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాలన చూసి ఓటేయమని అడిగే దమ్ము బాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు.