గుంటూరు: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దాదాపు తమ అభ్యర్థిత్వంపై కన్ఫమ్ చేసుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాలు కూడా మెుదలెట్టేశారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం అనేసరికి ఆ అభ్యర్థి ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి ఓటు వెయ్యాలంటూ అభ్యర్థించడం సహజం. 

అది ప్రత్యర్థి అభ్యర్థి ఇంటికైనా వెళ్లాల్సిందే. అదే పరిస్థితి చోటు చేసుకుంది గుంటూరు జిల్లాలో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

అందులో భాగంగా కన్నావారితోటలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. రాబోయే ఎన్నికల్లో తాను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

అనంతరం కన్నా ఆశీస్సులు తీసుకున్నారు. ఏసురత్నం ఓటు అభ్యర్థనపై చిరునవ్వు నవ్వుతూ ఓకే అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. కన్నా ఒకే అనగానే చిరునవ్వుతో అక్కడ నుంచి వచ్చేశారు వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం. ఈ వ్యవహారం చూస్తూ అంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారట.