అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో జరగనున్నట్లు ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. 

శాసన సభాపక్ష సమావేశం ఉన్నందు వల్ల నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి రావాలని ఆహ్వానించారు. శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుందని తెలిపారు. 

అనంతరం 11.30గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందని తెలిపారు. ఈ పార్లమెంటరీ సమావేశానికి నూతన ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు. 

శాసన సభాపక్ష సమావేశం, పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవనున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై గవర్నర్ నరసింహన్ తో చర్చించనున్నట్లు తెలిపారు.