కడప: ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తన సొంత జిల్లా అయిన కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 

కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి రెండోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణ రెడ్డిపై రెండు లక్షల ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి మరోసారి గెలుపొందారు. 

తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభపై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పులివెందులలో ఘన విజయం సాధించారు. 

వైయస్ జగన్  తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డిపై 90వేల 543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక కడప అసెంబ్లీ అభ్యర్థి అంజద్ బాషా సైతం టీడీపీ అభ్యర్థిపై 52,532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 43,200 మెజారిటీతో గెలుపొందారు. 

మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి సైతం 27,798 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డా.వెంకట సుబ్బయ్య 47 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అలాగే టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం వైసీపీ గెలుచుకుంది. 

టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు మరోసారి గెలుపొందారు. తన సమపీ ప్రత్యర్థిపై 24,059 ఓట్ల ఆధిక్యంతో తెలుపొందారు. 

ఇకపోతే రాయచోటి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి మరోమారు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 20,677 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి సైతం భారీ విజయం సాధించారు. 

27, 465 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. కమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి మళ్లీ విజయం సాధించారు. 27వేలకు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఇకపోతే కడప అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన ప్రతీ అభ్యర్థి 24 వేలు మెజారిటీకి ఎక్కడా తగ్గకుండా భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషం.