Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఎన్నికలు: 171 మందిపై కేసులు, వైసీపీ అభ్యర్థులే టాప్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న  పలు పార్టీలకు చెందిన 171 మంది అభ్యర్థులపై పలు కేసులున్నాయి. వైసీపీకి చెందిన 97 మందిపై, టీడీపీకి చెందిన 47 మందిపై ఆరోపణలున్నాయి.

ysrcp candidates top in cases in andhra pradesh
Author
Amaravathi, First Published Apr 7, 2019, 1:42 PM IST


అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న  పలు పార్టీలకు చెందిన 171 మంది అభ్యర్థులపై పలు కేసులున్నాయి. వైసీపీకి చెందిన 97 మందిపై, టీడీపీకి చెందిన 47 మందిపై ఆరోపణలున్నాయి.

ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీరిలో 171 మందిపై పలు కేసుల్లో నేర అభియోగాలున్నాయి. వైసీపీ చీఫ్ వైఎజ్ జగన్‌పై 11 సీబీఐ, 7 ఈడీ కేసులు సహా 31 కేసులున్నాయి.  ఆ తర్వాత స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై 26 కేసులు ఉన్నాయి.జనసేన తరపున పోటీ చేస్తున్న వారిలో 26 మందిపై కూడ కేసులున్నాయి.

వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై జగన్ ఆస్తుల కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ధర్మాన ప్రసాద రావు రెవిన్యూ మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా భూములు కేటాయించారనే ఆరోపణలతో ఆయనపై సీబీఐ కేసు నమోదైంది.

వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మోపిదేవి వెంకటరమణ, వసంత కృష్ణ ప్రసాద్, మల్లా విజయ ప్రసాద్, ఆదిమూలపు సురేష్‌లపై కూడ సీబీఐ కేసులు  ఉన్నాయి. ఇధే పార్టీకి చెందిన దాడిశెట్టి రాజా, బి. ముత్యాలనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

ఇక టీడీపీకి చెందిన మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డికి ఓ హత్య కేసులో హైద్రాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి యావజ్జీవ ఖైదు విధించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలులో ఉంది. 

ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో భీమడోల్ కోర్టు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌‌కు రూ. 1,000 జరిమానా విధించారు. రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

ప్రమాదకర ఆయుధంతో దాడి చేసిన కేసులో ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. దీనిపై ఆయన అప్పీలు చేసుకున్నారు.

ఇంట్లోకి చొరబడి బాంబులతో దాడి చేసిన కేసులో ధర్మవరం జనసేన అభ్యర్థి చిలకం మధుసూధనరెడ్డికి పదేళ్లు జైలు శిక్షపడగా.. ఆయన అప్పీలుకు వెళ్లారు. భార్య హత్య కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షపడిందని రేపల్లె జనసేన పార్టీ అభ్యర్థి కమతం సాంబశివరావు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక కేసు ఉంది. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు సంబంధించిన ఈ కేసులోనే మంత్రి నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు కూడా నిందితులుగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios