అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీచినట్టుగా కన్పిస్తోంది. తొలి దశ రౌండ్లలో వైసీపీ ప్రభంజనానికి సైకిల్ పంక్చర్ అయింది.  తొలి రౌండ్లలో వైసీపీ  101 కు పైగా అసెంబ్లీ స్థానాల్లో  ఆధిక్యంలో నిలిచింది. టీడీపీ అభ్యర్థులు కేవలం 21 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో నిలిచారు.

ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో  వైసీపీ, టీడీపీల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు శక్తి వంచన లేకుండా కృషి చేశాయి. 

ఏపీ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ ఓట్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదే ట్రెండ్‌ ఈవీఎంలలో కన్పించింది. టీడీపీ అభ్యర్ధుల కంటే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు.

టీడీపీ అభ్యర్థులు వైసీపీని అందుకోలేకపోయారు. టీడీపీకి చెందిన ప్రముఖులంతా వెనుకంజలోనే కొనసాగారు. తొలి రౌండ్‌లో ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చేతిలో 67 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో చంద్రబాబు నాయుడు వైసీపీ అభ్యర్ధి కంటే 1500 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

టీడీపీకి చెందిన ప్రముఖులు కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణ, నక్కా ఆనంద్ బాబు,  గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. వైసీపీకి చెందిన అభ్యర్ధులు దాదాపుగా అన్ని స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. నెల్లూరు జిల్లాలోని 10 చోట్ల వైసీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడ వైసీపీ ఆధిక్యంలో ఉంది.