శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని టీడీపీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎస్.సీవీ నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం వేసే పనిలో పడింది. శ్రీకాళహస్తి టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన పార్టీపై గుర్రుగా ఉన్నారు. 

దాదాపు అమరావతిలో 3రోజులపాటు ఉండి టికెట్ పై పైరవీలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. శ్రీకాళహస్తి టికెట్ ను మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

దీంతో ఎస్.సీ.వీ నాయుడు అలకబూనారు. టికెట్ దక్కించుకున్న సుధీర్ రెడ్డి ఎస్.సీ.వీ నాయుడును కలిశారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు. సుధీర్ రెడ్డి అభ్యర్థనపై సరే అని చెప్పిన ఎస్.సీ.వీ నాయుడు పార్టీలో ఉండాలా లేక ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలా వేరే పార్టీలో చేరాలా అనే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం ఎస్.సీ.వీ నాయుడుని వైసీపీ కీలక నేతలు కలిశారు. వైసీపీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బియ్యపు మధుసూదన్ రెడ్డిలు కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరారు. అయితే బుధవారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్.సీవీ నాయుడు బుధవారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాలకు చెందిన నేతలను సమావేశానికి రావాల్సింది ఆహ్వానించారు.