మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పూటకో మలుపు తిరుగుతోంది. హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ బృందం ఇప్పటికే వివేకా సోదరులు, బంధువులను విచారించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

మరోవైపు వివేకా ప్రధాన అనుచరుడు పరమేశ్వరరెడ్డిని తిరుపతి ఆసుపత్రిలో సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. అలాగే హత్యకు ఆర్థిక లావాదేవీలు, భూముల వ్యవహారాలు వాటి క్రయవిక్రయాలపై సిట్ దృష్టి పెట్టింది.

ఈ దర్యాప్తులో హత్యకు నెల క్రితం వేంపల్లె సబ్‌ రిజిష్ట్రార్ కార్యాలయంలో వివేకా పేరిట వేముల మండలంలో ఉన్న ఆస్తి విక్రయం జరిగినట్లు తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేంపల్లి సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.

వేముల మండలం దుగ్గన్నగారి పల్లెకు చెందిన ఓ వ్యక్తికి వివేకానందరెడ్డి పేరిట ఉన్న ఆస్తుల పవర్ ఆఫ్ అటార్ణీ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతేనే వివేకాకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయ వ్యవహారాలు చూస్తున్నట్లు సమాచారం.

తాజాగా జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఆయన పేరిట ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్ణీ రద్దు అయినట్లేనని సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయం తెలిపింది.