ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. శుక్రవారం నుంచి జగన్‌కు తోడుగా ఆయన తల్లి, వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద విజయమ్మ నివాళులర్పించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమని... ఆయనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ కలుగుతుందన్నారు.

వైఎస్ జగన్ కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నారు.. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు.. ప్రతి ఒక్కరికి నేనున్నానే భరోసా ఇచ్చాడు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో జగన్ జపం చేస్తున్నారని తెలిపారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు.