అసెంబ్లీ సమావేశం పూర్తైంది. వర్షం ఎక్కువగా ఉండటంతో ఈ సమయంలో వెళ్లడం అవసరమా అని అన్నాని కానీ ఆయన వినలేదన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి అంటూ బయలుదేరి మమ్మల్ని విడిచిపెట్టేశారని భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ పోయాక అందరూ తమకుటుంబాన్ని వదిలేశారని కానీ ప్రజలు మాత్రం వదల్లేదన్నారు. 

విజయనగరం : ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే తపనతో తమ కుటుంబం ఆలోచిస్తూ ఉంటుందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. 

అవకాశవాదానికి మాటమీద నిలబడేవారికి మధ్య జరగుతున్నాయని, ఈ ఎన్నికల్లో విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలతో తమ కుటుంబానికి దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. 

రాజశేఖర్ రెడ్డిని సీఎం చేశారని ఆయన సీఎం అయిన తర్వాత ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు అద్భుతమైన పథకాలు రూపొందించారని గుర్తు చేశారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనుకున్నారని కానీ ఆయన పాలనలో ఒక్క పైసా పన్ను కూడా పెరగలేదన్నారు. 

ప్రస్తుత పాలనలో అక్రమం, దౌర్జన్యం, మోసం మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. ఆనాడు వృద్దుల కోసం ఫించను తీసుకొచ్చారని, రైతే రాజు కావాలని, వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. 

మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టిన విషయాన్ని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లే ఇంకా పూర్తి చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం ఉందన్నారు. డ్వాక్రా మహిళలను ఆదుకున్న ఘనత వైఎస్ కే చెల్లుతుందన్నారు. 

ఆరోగ్య శ్రీ, 108 పథకాలు ఎంతో మంది ప్రాణాలు కాపాడాయని గుర్తు చేశారు. ప్రతీ పేదవాడి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్న లక్ష్యంతో ఫీరీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఆనాడు కేంద్రప్రభుత్వం గ్యాస్‌పై రూ.50 పెంచితే ప్రభుత్వమే భరించిందని తెలిపారు. 

రాజశేఖర్‌ రెడ్డి లేకపోవడం వల్ల తమ కుటుంబానికి వచ్చిన నష్టం కంటే ప్రజలకు కలిగిన నష్టమే ఎక్కువనిపిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశం పూర్తైంది. వర్షం ఎక్కువగా ఉండటంతో ఈ సమయంలో వెళ్లడం అవసరమా అని అన్నాని కానీ ఆయన వినలేదన్నారు. 

ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి అంటూ బయలుదేరి మమ్మల్ని విడిచిపెట్టేశారని భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ పోయాక అందరూ తమకుటుంబాన్ని వదిలేశారని కానీ ప్రజలు మాత్రం వదల్లేదన్నారు. జగన్‌ ఓదార్పు చేయడానికి వెళ్తే జగన్‌కే ఓదార్పు ఇచ్చిన గొప్ప మనసున్న మనుషులు అంటూ విజయమ్మ స్పష్టం చేశారు.