జగ్గయ్యపేట: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని లూఠీ చేశారని ఆరోపించారు. 

కొడుకేమో ప్పు అయితే తండ్రేమో గన్నేరు పప్పు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల బీజేపీతో నాలుగేళ్లు పొత్తు పెట్టుకుంది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు అని ఆమె ఆరోపించారు. అలాంటి చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తు లేదని ఆ అవసరం కూడా లేదన్నారు. 

సింహం సింగిల్ గా వస్తుంది జగన్ మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని జాతీయ సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. 

నక్కలే గుంపులుగా వస్తాయని అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ను, జనసేనను, మమతా బెనర్జీని, కేజ్రీవాల్‌ను, దేవేగౌడ్‌ను, ఫరూక్‌ అబ్దుల్లాను తోడు తెచ్చుకున్నారని విమర్శించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ , జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభానును భారీ మెజారిటీతో గెలిపించాలని వైఎస్ షర్మిల కోరారు. 

వాగ్ధానాలు చేయడమే కాదు, ఇచ్చిన మాట మీద నిలబడే నైజం రాజన్న వంశానిదని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతీ రైతు కుటుంబానికి, పేదల కుటుంబానికి ఒక భరోసా ఉండేదన్నారు. ప్రతీ మహిళ, విద్యార్థులకు ఎంతో ధైర్యం ఉండేదని చెప్పుకొచ్చారు. 

ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్య శ్రీ పథకం ఉండేదన్నారు. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో 108 వచ్చేదన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించారని గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని వైఎస్ ఆశపడేవారని తెలిపారు. 

ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా, ఏ పన్ను పెంచకుండా ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చూపించిన ఏకైక సీఎం వైఎస్ఆర్ అని కొనియాడారు. అయితే ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరని విమర్శించారు. 

రైతులు, మహిళలను చంద్రబాబు దగా చేశారని ఆమె ఆరోపించారు. డ్వాక్రా మహిళను రుణమాఫీ పేరుతో మోసం చేశారని చెప్పుకొచ్చారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. 

పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.