అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో పిన్న వయసులో సీఎం అవుతున్న రెండో వ్యక్తిగా జగన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు 1995లో 45 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు ప్రస్తుతం దేశంలో సీఎంలుగా ఉన్న చాలా మంది చిన్న వయసులోనే ఆ పదవిని అందుకున్నారు.

వీరిలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఆయన 2016లో 36 ఏళ్లకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మేఘాలయ సీఎంగా ఉన్న కనరాడ్ సంగ్మా 40, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ 43, యూపీ సీఎం యోగి ఆదిత్య నాధ్ 44 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యారు.

ఇక భారతదేశంలోనే అత్యంత పిన్న వయసు సీఎం ఎంవో హసన్ ఫరూఖ్ మారికర్.. 1967లో కేవలం 30 ఏళ్లకే ఆయన పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు సీఎంగా ఉన్నారు.