అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకానికి షురూ అవుతున్నారు. శనివారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. 

ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆ డిక్లరేషన్ ను గవర్నర్ నరసింహన్ కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. అందులో భాగంగా శనివారం వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైసీపీసీఎల్పీ భేటీ, పార్లమెంట్ సభ్యులతో భేటీ అయిన వైయస్ జగన్ అనంతరం హైదరాబాద్ కు పయనమయ్యారు. 

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 4.30 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ను తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కలవనున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన డిక్లరేషన్ ను గవర్నర్ కు అందజేయనున్నారు. 

అననంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. అక్కడ నుంచి నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను వైయస్ జగన్ కలవనున్నారు. ప్రగతిభవన్ లో సాయంత్రం 5.30గంటలకు వైయస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. 

ఈనెల 30న జరగబోయే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఫోన్ లో చర్చించారు వైయస్ జగన్. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం పెట్టింది శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో జగన్ ఇప్పటికే ప్రమాణ స్వీకారంపై ముచ్చటించారు.