ఏపిలో అరాచక పాలన  సాగిస్తున్న చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఆ దేవుడే స్క్రిప్ట్ రాసినట్లు వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చమత్కరించారు.  ఈ నెల 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో టిడిపికి కేవలం 23 సీట్లు రావడం, మనకు 151 సీట్లు రావడం ఆయన స్క్రిప్టులో భాగమేనన్నారు. గతంలో మన పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలగా తన పార్టీలో చేర్చకోవడానికి ఫలితమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. అంతేకాదు మనకు కూ 23 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇలా 23తో ముడిపడిన ఈ గొప్ప స్క్రిప్ట్ రాసింది ఆ దేవుడేనని జగన్ వెల్లడించారు.  

తాడేపల్లి పార్టీ కార్యలయంలో నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ పరిపాలనలో భారీ సంస్కరణలు తీసుకువస్తామన్నారు. అన్యాయం, అధర్మం చేస్తే  దేవుడు ఎలా మొట్టికాయలు వేస్తారో చంద్రబాబు పరిస్థితిని చూసే అర్థం చేసుకోవాలన్నారు. అరాచక పాలన కొనసాగించిన అతడిని ఓడించింది  ఆ దేవుడేనని జగన్ అన్నారు.  

ఏపి ప్రజలు  ఎంతో నమ్మకంతో మనకు గొప్ప బాధ్యత అప్పగించారన్నారు. వారికి మంచి పాలన అందించి 2014 లో ఇంతకంటే గొప్ప  విజయాన్ని అందుకోవాలన్నారు. అప్పుడు కేవలం మన సమర్ధతకు మద్దతుగా  ఓటేసే పరిస్థితి రావాలని... ఆ దిశగానే మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. సుపరిపాలనలో ప్రజల సహకారం కూడా కావాలని...తప్పకుండా వారు అండగా నిలుస్తారని  భావిస్తున్నట్లు జగన్ తెలిపారు.. 
  
రానున్న 6 నెలల్లోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని జగన్ మరోసారి అన్నారు. ఇది నా ఒక్కడి  విజయం మాత్రమే కాదని పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు  ముఖ్యంగా ప్రజల విజయమని అన్నారు. తాను చేపట్టిన 3,600 కిలోమిటర్ల పాదయాత్రను ఎప్పటికి మరిచిపోలేనని అన్నారు. ఇక  2024 లక్ష్యంగా  పనిచేయాలని నూతన ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు.