అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యత దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్లలో వైసీపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. ప్రస్తుతానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 147 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. 

ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తేలడంతో వైయస్ జగన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కౌగిలించుకుని ఆనందం పంచుకున్నారు. 

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైయస్ జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేశారు. పార్టీ విజయంపై స్వరూపానందేంద్రసరస్వతితో మాట్లాడారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. 

వీరిద్దరి మధ్య సీఎంగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనే అంశం చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు స్వరూపానంద స్వామి. ఈ నెల 30న వైయస్ జగన్ మోహన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.