చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు సీఎం అనే పదానికి అర్థం మార్చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు హయాంలో సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

చంద్రబాబు అంతటి మాయావి ఎవరూ ఉండరంటూ ధ్వజమెత్తారు. గోబెల్స్ వారసుడు చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. సినిమాల్లో విలన్ చేయాల్సిన పనులన్నీ చంద్రబాబు చేశారని ఆరోపించారు. 

తన బాబాయ్ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని సీఎం చంద్రబాబే చంపించారని ఆరోపించారు. వారే చంపి వారి పోలీసులతోనే విచారణ చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన బాబాయ్ హత్య కేసులో చంద్రబాబు పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని జగన్ నిలదీశారు. 

తమ ఇంట్లో వ్యక్తి చనిపోతే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు కంటే దిక్కుమాలిన వ్యక్తి మరెవరైనా ఉంటారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నిజంగానే నేరస్థుడు కాకపోతే.. తెలంగాణ కానిస్టేబుల్‌కీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు.