ఎన్నికల నగారా మోగింది..ప్రచారానికి కానీ, ఏం చేసుకోవడానికైనా కానీ మిగిలింది పట్టుమని నెల రోజులు. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను జల్లెడ పట్టేందుకు జగన్ ఇంకా ప్రయత్నాలు మానడం లేదు.

టీడీపీలో అసంతృప్త నేతలకు గురిపెట్టిన ఆయన టికెట్లు రాని కీలక నేతలను తనవైపుకు లాక్కొని బరిలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అధినేత వైఖరి వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గత ఐదేళ్ల నుంచి అన్ని రకాలుగా సిద్దంగా ఉండటంతో పాటు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన నియోజకవర్గ సమన్వయకర్తలను ఇప్పుడు ఇదే భయం వెంటాడుతోంది.

పార్టీ పటిష్టత కోసం ఎంతగానో శ్రమించి, ఊరువాడా తిరిగి కష్టపడి, డబ్బులు ఖర్చు చేసిన తర్వాత... తమను పక్కనపడేసి ఇతరులను అభ్యర్థులగా ప్రకటిస్తే ఇంతకాలం తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోని వైసీపీ సమన్వయకర్తల పరిస్ధితి అడకత్తెరలో చిక్కుకున్నట్లుగా తయారైంది. సమన్వయకర్తలే అభ్యర్థుగా బరిలోకి దిగుతారని జగన్ గతంలోనే చెప్పారని పలువురు సీనియర్లు ధైర్యం చెబుతున్నా... సమన్వయకర్తలకు నమ్మకం చిక్కడం లేదు.

టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి జగన్ టిక్కెట్ల హామీలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రచారం చేపడితే... తీరా చివరి నిమిషంలో టికెట్ రాకపోతే ఆర్ధికంగా చితికిపోతామని, అలాగని ఫైనల్ లిస్ట్ ప్రటించేదాకా వేచిచూస్తే ప్రత్యర్థి కంటే ప్రచారంలో వెనుకబడిపోతామని వారు భావిస్తున్నారు.

ఏది ఏమైనా తమను అధికారిక అభ్యర్ధులుగా ప్రకటిస్తేనే ప్రజల్లోకి వెళ్తామని కొందరు సమన్వయకర్తలు తేల్చిచెబుతున్నారు. మరోవైపు పార్టీలోని కీలక నేతలు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం మరింత బలమైన అభ్యర్థుల కోసం జగన్ సెర్చ్ చేస్తున్నారు. టీడీపీలోని బలమైన నేతలకు జగన్ గాలం వేస్తున్నట్లు లోటస్‌పాండ్‌లో టాక్ నడుస్తోంది.