కడప: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డిపై 90,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

వైయస్ఆర్ కాంగ్రె పార్టీ తరపున పులివెందుల నుంచి జగన్ రెండోసారి పోటీ చేశారు. రెండుసార్లు కూడా ప్రత్యర్థి సతీష్ రెడ్డే కావడం విశేషం. ఇకపోతే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన వైయస్ జగన్ తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డిపై 76, 243 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. 

2019 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మరింత మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సాధించిన ఓట్లు కన్నా ఈసారి 13 వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా సాధించారు.  అంటే 90వేల 543 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

ఇకపోతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కుప్పం నియోజకవర్గం నుంచి 70వేల మెజారిటీతో గెలుపొందుతారని ప్రచారం జరిగింది. టీడీపీ నేతలు వేదికలపై సవాల్ లు సైతం విసిరారు. 

అయితే చంద్రబాబు కేవలం 30 వేల మెజారిటీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గత మెజారిటీని దాటిన వారిలో సైతం జగన్ చంద్రబాబు ను మించి పోయారు. 2014 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి కె.చంద్రమౌళిపై 47,121 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

ఇకపోతే 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కె.చంద్రమౌళిపై కేవలం 30 వేల మెజారిటీతోనే గెలుపొందారు. దీంతో పోలిస్తే గతం కంటే తక్కువ మెజారిటీతో గెలుపొందారు చంద్రబాబు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మెజారిటీ విషయంలోనూ చంద్రబాబును వైయస్ జగన్ ఓడించారు.