రాజమండ్రి: రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ టీడీపి వంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థులతో చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. 

ప్రత్యర్థుల కల్పించిన ఆటంకాలను పోటాపోటీగా ఎదుర్కొన్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీకి, రాష్ట్రానికి నష్టం చేయాలని ప్రధాని మోడీ చేయని ప్రయత్నమంటూ లేదని ఆయన అన్నారు. టీడీపీకి నష్టం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. జగన్‌ కుట్రలకు మోడీ, కేసీఆర్‌ కుతంత్రాలు తోడయ్యాయని ఆయన అన్నారు. 

ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పోటీకి అభ్యర్థులు లేనప్పుడు సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడారని, ప్రమాణ స్వీకార ముహూర్తం, మంత్రి పదవులు మైండ్‌గేమ్‌లో భాగమేనని చంద్రబాబు అన్నారు. వీళ్లకు తోడు మాస్టర్‌ సెఫాలజిస్ట్‌ ప్రశాంత్ కిషోర్ తోడయ్యాడని వ్యాఖ్యానించారు.
 
పోలింగ్ సమయంలో హింస, విధ్వంసాలకు స్కెచ్‌లు వేసి అమలు చేశారని చెప్పారు. ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలు చేశారని, టీడీపీ నేతలను బెదిరింపులకు గురి చేశారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఊళ్లకు వెళ్తే  ప్రజలు నిలదీశారని, మన ఎమ్మెల్యేలపై పనులు చేయలేదనే అసంతృప్తి లేదని ఆయన అన్నారు. 

ఏపీలో ఓటేసేందుకు రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఎంతోమంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని ఆయన అన్నారు. వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్‌ బేరాలు ప్రారంభించారని ఆయన వ్యాఖ్యానించారు.