అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించి ఈనెల 30 ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. 

ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరనున్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ కానున్నారు. ఈనెల 30న విజయవాడలో తాను చేయబోతున్న ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్ కోరనున్నారు. 

ఇకపోతే ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి సంబంధించి కేసీఆర్ తో జగన్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 10.30 గంటలకు వైయస్ జగన్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభాపక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తారు.

ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రాష్ట్రగవర్నర్ నరసింహన్ ను కలివనున్నారు వైయస్ జగన్. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఇకపోతే ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తరుణంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైయస్ జగన్ కు అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.