కడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పులివెందుల తహాశీల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్నాం 1.49 గంటలకు రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 

వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట కడప మాజీ ఎంపీ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి బంధువులు ఉన్నారు. ఇకపోతే వైఎస్ జగన్ నామినేషన్ సందర్భంగా భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. 

జగన్ నామినేషన్ దాఖలు చేసే ముందు సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలో ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.