అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అఖండ మెజారిటీ దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కించిన ఓట్లలో 50.8శాతం ఓట్లు సాధించి చరిత్ర తిరిగి రాసింది. 

అంతేకాదు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర, కోస్త్రాంధ్రలో వైసీపీ పాగా వేసింది. ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీని కోలుకోలేని దెబ్బతియ్యాలనుకున్న జనసేన పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది వైసీపీ. 

ఇకపోతే కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగుల వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశలను ఆడియాసలు చేస్తూ ఓటర్లు జగన్ కు పట్టం కట్టడం విశేషం. 

ఇకపోతే రాయలసీయలో పాగా వేయాలని భావించిన చంద్రబాబు కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి రాయలసీమలో ఎలాగైనా పాగా వేయాలని భావించిన టీడీపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతూ రాయలసీమ ఓటర్లు తీర్పునిచ్చారు. 

కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 స్థానాల్లో వైసీపీ ఆధిక్యతలో ఉండగా, ఒకచోట టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇకపోతే వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ సొంత ఇలాఖా అయిన కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యతతో కొనసాగుతోంది. 

ఇకపోతే ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ప్రకాశం జిల్లాలో 8 స్థానాల్లో వైసీపీ, నాలుగు స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కొనసాగిస్తోంది. ఇకపోతే చిత్తూరు జిల్లాలో 13 స్థానాల్లో వైసీపీ, ఒకస్థానంలో టీడీపీ లీడ్ లో ఉంది. 

అటు అనంతపురం జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ, రెండు స్థానాల్లో టీడీపీ ఆధిక్యతలో ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. 10  స్థానాల్లో వైసీపీ ఆధిక్యతలో ఉంది. ఇకపోతే ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. 

అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యత కనబరుస్తోంది. అటు శ్రీకాకుళం జిల్లాలో 9 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. అటు పశ్చిమగోదావరి జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ , ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. 

అటు గుంటూరు జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ, 5 చోట్ల టీడీపీ ఆధిక్యం, కృష్ణా జిల్లాలో 9 చోట్ల వైసీపీ, ఏడుచోట్ల టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. విశాఖ జిల్లా విషయానికి వస్తే 10 చోట్ల వైసీపీ, నాలుగు చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. అటు తూర్పుగోదావరి జిల్లాలో 15 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి.