తాడిపత్రి:కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇవ్వడం చంద్రబాబు చూశారా అని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సిగ్గు లేకుండా చంద్రబాబునాయుడు అబద్దాలు ఆడుతున్నాడని ఆయనప విమర్శించారు.

సోమవారం నాడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతిస్తుంటే చంద్రబాబునాయుడు అసత్య ప్రచారం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించినా విషయాన్ని జగన్ గుర్తు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాలు నిధులు సాధించుకునేలా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేపడుతుంటే.. చంద్రబాబు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పక్క రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపితే చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.. గతంలో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టనర్‌ కేసీఆర్‌ను ఎన్నిసార్లు  కేసీఆర్ ను పొగిడారో గుర్తుతెచ్చుకోవాలన్నారు.ఓట్లకు కోట్లతో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి వచ్చాడని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రవాళ్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. అదే నిజమైతే రామోజీరావు, రాధాకృష్ణలను కేసీఆర్ బెదిరించారా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే జ్ఞానం లేకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో ఉన్న మన ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.