అవనిగడ్డ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలించిన 57 నెలలు నరకం చూపించాడు అంటూ చెప్పుకొచ్చారు. 

ఆ తర్వాత మూడు నెలలు సినిమాలు చూపిస్తున్నాడంటూ మండిపడ్డారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరన్నారు. అధికారం కోసం ఆనాడు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని చెప్పుకొచ్చారు. 

ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచేందుకు 600 హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని అమలు చెయ్యకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. విజయవాడ జిల్లాలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన చంద్రబాబు చివరికి విజయవాడని కాల్ మనీ సెక్స్ రాకెట్ కు అడ్డాగా చేశారని ఆరోపించారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను కాపాడి వారికి అండగా నిలిచారంటూ మండిపడ్డారు. విజయవాడ నడిబొడ్డున ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్నారని విమర్శించారు. ఒక ఐపీఎస్ అధికారిని టీడీపీ నేత చొక్కా పట్టుకున్నా చూస్తూ ఉన్నాడే కానీ పట్టించు కోలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 

విజయవాడలో భూములు కబ్జా చేశాడని సాక్షాత్తు సీఎంగా ఉంటూ లైసెన్స్ లేకుండా బోట్లను నడిపి 23 మందిని బలితీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విరుచుకుపడ్డారు. పవిత్రమైన కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించి దేవాలయం పవిత్రతకు భంగం కలిగించారంటూ ఆరోపించారు. 

ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను అని పదేపదే చెప్తున్న చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అయినా విజయవాడలో ఫ్లై ఓవర్ ఎందుకు నిర్మించలేకపోయావ్ అంటూ నిలదీశారు. ఒక్క ఫ్లైఓవర్ నిర్మించలేని నువ్వా రాజధాని నిర్మించేది అంటూ ప్రశ్నించారు. 

అమరావతిని సింగపూర్ చేస్తా అంటూ చెప్తున్న చంద్రబాబు కనీసం రాజధాని శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుక అయినా వేశావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం గురించి ప్రశ్నిస్తే బాహుబలి సినిమా చూపించి తప్పించుకుంటారంటూ విరుచుకుపడ్డారు.