గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా ట్విట్టర్ వేదికగా మండిపడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ప్రజల జ్ఞాపకశక్తి, తెలివితేటలపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందన్నారు.

సెల్‌‌ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టిన దగ్గర నుంచి సంక్రాంతికి గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకోవాలని కూడా ప్రజలు తమను చూసే అలవాటు చేసుకున్నారని ముఖ్యమంత్రి అంటున్నారని విజయసాయి ధ్వజమెత్తారు.

ఈ సమయంలోనే జనం కర్రును కొలిమిలో వేడిమి చేయడం మొదలుపెట్టారన్నారు. ఏప్రిల్ 11న చంద్రబాబుకు వాతలు తప్పవని జోస్యం చెప్పారు. పోలీసులే టీడీపీ ప్రచార కర్తలుగా మారారని, రాప్తాడులో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు.

మంత్రి నారాలోకేశ్ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరదల నీరు ఇళ్లల్లోకి వస్తే సర్వం కోల్పోయామని పెద్దలు విలవిల్లాడుతుంటారని, దాని గురించి తెలియని పిల్లలు మాత్రం నీటిలో సంతోషంగా గడుపుతారని తెలిపారు.

అలాగే ఓటమి భయంతో చంద్రబాబు వణికిపోతుంటే.. ఇవేవీ తెలియని లోకేశ్ మంగళగిరిలో తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.