ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కి... ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే... జగన్ ఇచ్చిన ఆఫర్ ని ప్రశాంత్ కిశోర్ ఒకే చేశారా లేదా అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల ఏపీ ఎన్నికలకు పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలు రావడానికి మాత్రం ఈ నెల 23వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. వ్యూహాత్మంగా అడుగులు వేసి పోలింగ్ సమయానికి ప్రజల ముందుకు వచ్చారు.

జగన్ అంత వ్యూహాత్మంగా అడుగులు వేయడానికి కారణం ప్రశాంత్ కిశోర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మూడేళ్లుగా ప్రశాంత్ కిశోర్ టీం.. వైసీపీ కోసం పనిచేసింది. ఈ పని కచ్చితంగా ప్రతిఫలం ఇస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారం. విజయం కచ్చితంగా తమనే వరిస్తుందని జగన్ ధీమాతో ఉన్నారు.

ఇటీవల జగన్  ప్రశాంత్ కిశోర్ టీంని కలిసినప్పుడు  కూడా.. జగన్ ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. ఈ ఒక్కమాట చాలు గెలుపుపై వారెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో. ఈ విషయం పక్కన పెడితే తాజాగా జగన్ ప్రశాంత్ కిశోర్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలిస్తే... ఇక పై ఇప్పటి నుంచి జగన్ తోపాటు పీకే టీం పనిచేసేలా ఒప్పందం చేసుకుందామని జగన్ కోరినట్లు తెలుస్తోంది. అంటే ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం.. ఎలా చేస్తే ప్రజలను ఆకట్టుకోవచ్చు..? ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉంది అలాంటి విషయాలను  పీకే టీం జగన్ కి తెలియజేస్తారనమాట.

మరి దీనికి ప్రశాంత్ కిశోర్ ఎలా స్పందించారో మాత్రం తెలీలేదు. ఫలితాల తర్వాత తన సమాధానం చెబుదామని ఆయన ఎదురు చూస్తున్నట్లు సమాచారం.