పి.గన్నవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను తన కుటుంబాన్ని తీవ్రంగా మోసం చేశారని ఆ పార్టీ నేత యన్నపు లలిత ఆరోపించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో తాను చిత్తశుద్ధికలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. 

అలాంటి తనను కాదని మాజీఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవికి టికెట్ ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. తనకు టికెట్ వస్తుందని ఆశించి ఎంతో డబ్బు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు తాను అనేక గ్రామాల్లో రూ.75లక్షలు పైగా ఖర్చుపెట్టానంటూ చెప్పుకొచ్చారు.

 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తనను కాకుండా కొద్ది రోజుల క్రితమే పార్టీలోకి వచ్చిన పాముల రాజేశ్వరి దేవికి టికెట్ ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి తన కుటుంబం ఐదేళ్లుగా ఎంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు.

 తన ఆస్తిని సైతం అమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పుకుంటూ బోరున విలపించారు. పవన్ కళ్యాణ్ ని అన్నా అన్నా అంటూ తాను ఎంతో గౌరవించానని అలాంటి వ్యక్తి తమను మోసం చెయ్యడం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. 

తాను పార్టీలో చేరినప్పుడే టికెట్ ఇవ్వమని చెప్పి ఉంటే వేరేలా ఉండేదన్నారు. ఇన్నాళ్లు పార్టీ బలోపేతానికి తమ కుటుంబాన్ని ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము పనికిరామా అని నిలదీశారు. జనసేన పార్టీ కోసం ఊరువాడ తిరుగుతూ పార్టీ బలోపేతాన్ని చేశానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 

ఇక తాను జనసేన పార్టీలో ఉండదలచుకోలేదని తెలిపారు. మీకు మీ పార్టీకి ఒక దండం అంటూ బోరున విలపించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పేవారని అయితే తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో పవన్ సమాధానం చెప్పాలని నిలదీశారు.

 పవన్ చెప్పిన సిద్ధాంతాలను చూసే తాను పార్టీలోకి వచ్చానని అయితే తీరా చూశాక ఆయన చెప్పింది ఒకటి చేసింది మరోకటిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి ఒక దండం అంటూ బోరున విలపించారు. 

పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా కనీసం టికెట్ ఇవ్వలేకపోతున్నామని మాటవరుసకు అయినా కూడా పార్టీ అనలేదని వాపోయారు. దళిత జాతికి చెందిన మహిళను కాబట్టే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. అన్న అని పిలిచినందుకు తగిన బుద్ది చెప్పారంటూ యన్నపు లలితకుమారి బోరున విలపించారు.