ఏప్రిల్ 11వ తేదీన పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు ఎవరికి ఓటు వేశారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. మహిళ ఓటర్లు తమకే ఓటు వేశారని అభిప్రాయంతో టీడీపీ, వైసీపీ నేతలు ఉన్నారు
అమరావతి: ఏప్రిల్ 11వ తేదీన పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు ఎవరికి ఓటు వేశారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. మహిళ ఓటర్లు తమకే ఓటు వేశారని అభిప్రాయంతో టీడీపీ, వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఈవీఎంలు మొరాయింపు టీడీపీకి కొంత నష్టం చేసి ఉండి వచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలకు చంద్రబాబునాయుడు పెద్ద పీట వేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే పెద్ద ఎత్తున పసుపు- కుంకుమ , అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు వంటి పథకాలను ప్రకటించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు పసుపు- కుంకుమ మూడో విడత కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి చేరాయి.
పోలింగ్ రోజున ఉదయాన్నే పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే ఆ సమయంలో ఈవీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత కొందరు మహిళలు తమ ఇళ్లకు వెళ్లారు. ఈవీఎంలు పనిచేసిన తర్వాత ఓటు వేసేందుకు రావాలని భావించారు. అయితే మధ్యాహ్న సమయాల్లో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకొన్నాయి.
ఈ పరిణామాలతో టీడీపీ వర్గాలు మహిళలను ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్దకు మహిళలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబునాయుడు కూడ పోలింగ్‌లో పాల్గొనాల్సిందిగా కోరారు. సాయంత్రం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అర్ధరాత్రి వరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది.
పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించకపోవడం తదితర పరిణామాలు కూడ ఓటర్లలో చికాకు తెప్పించాయి. పోలింగ్ రోజున చోటు చేసుకొన్న పరిణామాలు రాజకీయంగా కొంత తమకు నష్టం కల్గించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారని సమాచారం.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగితే మహిళల ఓటింగ్ తమకు వన్‌సైడ్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. పోలింగ్ రోజున చోటు చేసుకొన్న పరిణామాలు ఉద్దేశ్యపూర్వకంగా జరిగినట్టుగానే ఆ పార్టీ భావిస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద చోటు చేసుకొన్న ఘటనలు కూడ రాజకీయంగా ఏ పార్టీకి కలిసివచ్చాయనే విషయమై మే 23న తేలనుంది
