అమరావతి:తెలుగుదేశం పార్టీలో యువనేత చింతకాయల విజయ్‌పాత్రుడుకు ఈ దఫా కూడ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు. విజయ్‌పాత్రుడు సహచరులు  కొందరు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.మరికొందరు ఇప్పటికే ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు.

2014 ఎన్నికలకు ముందు టీడీపీ వ్యవహరాల్లో నారా లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయం నుండి లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఆయన పార్టీ వ్యవహరాల్లో కీలకంగా మారారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీలో కీలకంగా ఉన్న నేతల తనయులతో 2014 ఎన్నికలకు ముందు లోకేష్ సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశంలో భవిష్యత్తుపై చర్చించారు.  హైద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆ సమయంలో వీరంతా సమావేశమయ్యారు.2014 ఎన్నికల సమయంలో కొందరు యువ నేతలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కొందరు పోటీకి దూరంగా ఉన్నారు. మరికొందరు ఈ ఎన్నికల్లో తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ చేవేళ్ల ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్  నుండి  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ రెండు దఫాలు వీరేందర్ గౌడ్ పోటీ ఓటమి పాలయ్యాడు.  2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

గత ఎన్నికల సమయానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయస్సు సరిపోని కారణంగా పరిటాల శ్రీరామ్ పోటీకి దూరంగా ఉన్నారు. ఈ దఫా మాత్రం రాఫ్తాడు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్నారు.

అమలాపురం ఎంపీ స్థానం నుండి జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే  ఎమ్మిగనూరు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బీవీ జయనాగేశ్వర రెడ్డి విజయం సాధించారు.ఈ దఫా ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

కింజారపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్ పాత్రుడు టీఎన్ శేషన్ కాలేజీలో కొంత కాలం శిక్షణ కూడ తీసుకొన్నారు. వీరిద్దరూ కూడ టీడీపీ కార్యక్రమాల్లో సభల్లో అద్భుతంగా ప్రసంగిస్తారు. 

విజయనగరం జిల్లా నుండి మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు కూతురు  అదితి గజపతి రాజు తొలి సారి పోటీ చేస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి ఆమె టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.గత టర్మ్‌లోనే లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా కూడ కొనసాగుతున్నారు. మంగళగిరి నుండి ఆయన ఈ దఫా ఆయన పోటీ చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస నుండి గౌతు శివాజీ కూతురు శిరీష ప్రస్తుతం పలాస నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగారు.మాజీ తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి కూతురు డాక్టర్ స్వాతి కూడ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా పనిచేస్తున్నారు.ఈ ఎన్నికల్లో 10 మంది వారసులకు చంద్రబాబునాయుడు టిక్కెట్లను కేటాయించారు. కానీ విజయ్ పాత్రుడికి మాత్రం అవకాశం దక్కలేదు.