విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు నెంబర్‌వన్‌ అంటూ విరుచుకుపడ్డారు. 

ఒక్కో ఓటును రూ.10వేలకు కొనుగోలు చేస్తున్నారని గంటా సన్నిహితులే తనతో చెప్తున్నారని ఆయన ఆరోపించారు. పోలింగ్‌ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి గంటా అని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తనపై పోటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గంటా శ్రీనివాసరావు విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని ఆయన ఆరోపించారు. బూత్‌ కమిటీల్లో అన్ని రాజకీయల పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీని ఓడిండమే తన లక్ష్యమని విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు. 

ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి గంటా శ్రీనివాసరావు దొంగ ఓట్లను సృష్టించారని ఆరోపించారు. గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని ఆరోపించారు. అవినీతికి మరోరూపం గంటా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.