చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో రామచంద్రాపురం ఎన్ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం రాత్రి కమ్మపల్లికి చేరుకున్నారు.

అయితే స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు కమ్మపల్లికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. అయితే గ్రామంలోని దళితులపై టీడీపీ నేతలు దాడి చేశారని.. వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా తనను అడ్డుకున్నారని చెవిరెడ్డి తెలిపారు.

రీపోలింగ్ జరుగుతున్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో కమ్మపల్లి కూడా ఉంది.. ఈ క్రమంలో పోలింగ్‌కు ముందే ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అర్బన్ ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.