హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసులో సూత్రధారులు సీఎం చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ లేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. సూత్రధారులు చంద్రబాబు, లోకేష్ లు అయితే చెయ్యించింది మంత్రి ఆదినారాయణరెడ్డేనని ఆరోపించారు. 

ఈ హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్ర ముమ్మాటికి ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అంతమెుందించాలని తెలుగుదేశం పార్టీ అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1998 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రరాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలన్నదే వారి ప్లాన్ అని ఆరోపించారు. 

1998లో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ ప్రమేయం గురించి అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. ఆకేసులో నిందితులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయమే రక్షణ కల్పించిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితులను సత్ప్రవర్తన పేరుతో విడుదల చేశారని తెలిపారు. 

ఇకపోతే 2009 ఆగష్టు 31న నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎవరు ఫినిష్ అయిపోతారో చూడండి అంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఫినిష్ అన్న రెండు రోజులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని తెలిపారు. వైఎస్ మరణంపై ఉన్న అనుమానాలు నేటికి నివృత్తికాలేదన్నారు. 

ప్రజల మనసెరిగిన వైఎస్ ను పొట్టన బెట్టుకుంది టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిందన్నారు. 

ఆ హత్యలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉన్నప్పటికీ  అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆదినారాయణ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదనే అభద్రతతో వివేకానందరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. 

ఈహత్య కేసులో ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉందన్నారు. అయితే కేసును తప్పుబట్టేందుకు ఆస్తిగొడవలు అంటూ సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన నీతినియమాలు లేకుండా టీడీపీలో చేరారని ఆరోపించారు. 

మనిషి జాతిలో అతను పుట్టడం అనేది ప్రతీ మనిషి బాధపడాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. మనిషిగా పుట్టినందుకు గర్వించాలి కానీ ఆదినారాయణ మనిషి కాదు దుర్మార్గుడు అంటూ చెప్పుకొచ్చారు. ఆదినారాయణరెడ్డి చరిత్ర నేరాల దిట్ట అని చెప్పుకొచ్చారు. 

గతంలో అనేక హత్యలు చేయించారని ఆరోపించారు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు గంట కాకముందే అది హత్య కాదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారని గుర్తు చేశారు. 

ఎవరికి ప్రమాదం ఉందో అన్న రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించాల్సిన అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు చంద్రబాబుకు తొత్తుగా మారారని ఆరోపించారు. సిట్ కూడా అడిషనల్ డీజీ డైరెక్షన్లోనే పనిచేస్తోందని తమకు సిట్ పై నమ్మకం లేదన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సీబీఐ మాత్రమే నిజమైన నిందితులను పట్టించుకుంటుందన్నారు.