ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నుండి పోటీ చేయనున్నట్లు టిడిపి తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటనపై వైఎస్సార్‌సిపి నాయకులు విజయసాయి రెడ్డి స్పందించారు. లోకేశ్ రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నుండి పోటీకి దిగడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలే విసిరారు. 

విజయసాయి రెడ్డి లోకేశ్ పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు  విసిరారు. '' మొత్తం 175 స్థానల్లో గెలసుస్తామని కోతలు కోసిన పప్పు నాయుడు సురక్షిత సీటు కోసం గాలిస్తున్నాడు. పచ్చమీడియా కుప్పం, భీమిలీ,విశాఖ నార్త్, పెదకూరపాడు పేర్లు వదిలింది. ఓడిపోతాడని ఫీడ్ బ్యాక్ రావడంతో మంగళగిరి వైపు సేఫ్ అనుకుంటున్నారట. కమాన్ త్వరగా ప్రకటించండి పెద్ద నాయుడూ.'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

అలాగే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం కాపులను చిన్నచూపు చూస్తూ అవమానించడం తాను దగ్గరనుండి  చూశానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆయన తన కులానికి చెందిన వారికే అన్ని అవకాశాలిస్తూ మిగతా కులానికి చెందిన నాయకుల రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేవారని ఆరోపించారు. దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ...'' లోక్ సభలో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ గా ఉన్న తోట నర్సింహం గారికి ఎదురైన అవమానాలను దగ్గర నుంచి చూశా. చాలా సీనియర్ అయినా, కాపు అయినందుకే ఆయనను అనేక రకాలుగా మానసికంగా హింసించారు. ఎజెండా విషయాలు కూడా ఆయనకు చెప్పకుండానే నిర్ణయించేవారు. బాబు కులం కాని వారిందరికి టీడీపీలో ఇదే దుస్థితి.'' అని పేర్కొన్నారు. 

మరో ట్వీట్ లో '' గజ్జి, తామరకు ‘సపట్ మలాం’ అనే పూత మందు బాగా పనిచేస్తుందని వాడిన వారు చెబుతారు. 3.7 కోట్ల మంది ఓటర్లు చంద్రబాబు పట్టిన కులగజ్జికి సపట్ మలాంను పూసి ట్రీట్ మెంటు ఇస్తారు. ఏప్రిల్ 11 తర్వాత ఏపీలో ఆ వ్యాధే ఉండదు. దేశం గర్వించే రాష్ట్రంగా ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది.'' అంటూ చంద్రబాబు పై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.