Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీఐ కమిషనర్ల నియామకం...సీఎస్ కి విజయసాయి లేఖ

ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎస్ కి లేఖ రాశారు

vijayasai reddy letter to CS over RTI commissioner
Author
Hyderabad, First Published May 10, 2019, 2:54 PM IST

ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎస్ కి లేఖ రాశారు. ఓ హోటల్ యజమానికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు అప్పగించడంపై విజయసాయి రెడ్డి అభ్యంతకరం వ్యక్తం చేశారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న ఇ.శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ పార్టీ యాక్టివిస్టులు. ఇలాంటి వారిని ఆర్టీఐ కమిషనర్లుగా ఎలా నియమిస్తారు అని ఆయన ప్రశ్నించారు. 

‘‘ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం నియామకాలు చేపట్టాలి. ఆర్టీఐ యాక్ట్ 2005 సబ్ సెక్షన్ 5 ప్రకారం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టేవారికి తగిన అర్హతలు ఉండాలని తెలియజేస్తోంది. ’’

‘‘ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూస్తే..లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్‌మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఆ పదవులకు ఎంపిక చేయాలి. దానికి భిన్నంగా టీడీపీ యాక్టివిస్టులను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు.’’

 ‘‘అంతేకాకుండా ఈ పదవులకు ఎంపిక అయ్యే వ్యక్తులు ఎంపీలు కానీ, రాష్ట్ర శాసనసభల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లోనూ ఉండకూడదు. ఎలాంటి పార్టీలతోనూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదని ఆర్టీఐ యాక్ట్ తెలియజేస్తోంది.’’

‘‘ఓ హోటల్ యజమాని, మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తులను ఎలా ఎంపిక చేశారు. ఏ ప్రాతిపధికన సీఎం, సీనియర్ కేబినెట్ మినిస్టర్ వీళ్ల పేర్లు సిఫార్సు చేయటం జరిగింది?. వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించారు. శ్రీరాంమూర్తి పేరును గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాంమూర్తికి సామాజిక సేవతో సంబంధాలు ఉన్నాయా?. ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీగా ఉన్న సమయంలో కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేశారు.

ఈ ఆర్టీఐ కమిషనర్ నియామకాలు అన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడినవి. 4 ఏళ్ల పాటు సాగదీసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నియామకాలు చేయటంలో ఆంతర్యం ఏమిటి?.  2017లో ఆరుగురును ఆర్టీఐ కమిషనర్లుగా నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండటంతో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికైనా ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలి’అని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios